వేములవాడ రాజన్న (రాజరాజేశ్వర స్వామి) దేవస్థానం పురాణం, చరిత్ర మరియు విశిష్టత - Vemulawada Rajanna (temple) History and its Mythology Stories

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ గుడిచెరువు గట్టుపై కొలువైన రాజరాజేశ్వర స్వామికి కుడివైపున లక్ష్మీగణపతి, ఎడమ వైపున రాజరాజేశ్వరీదేవి కొలువుతీరారు. వీరిద్దరే కాదు, ఆలయంలో మొత్తం 366 దేవతల సమేతంగా దర్శనమిచ్చే ఆ రాజరాజేశ్వరుడిని చూసేందుకు పర్వదినాల్లో లక్షలాది భక్తులు తరలివస్తారు. ఇక్కడ స్వామి నీలలోహిత శివలింగ రూపంలో దర్శనమిస్తాడు.

ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అనంతపద్మనాభస్వామి. ఇదే ప్రాంగణంలో సీతారామచంద్రస్వామి ఆలయం కూడా ఉంది. రెండు వైష్ణవాలయాలు కూడా ఉండటంవల్లే ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగానూ పిలుస్తున్నారు. ప్రాంగణంలోని ధ్వజస్తంభం పక్కనే ఈశాన్యంలో దర్గా కూడా ఉంది. అందుకే భిన్న మతాల పూజలూ, విభిన్న ఆచారాలకూ వేములవాడ క్షేత్రం ప్రతీకగా నిలుస్తోంది.

Vemulawada temple history - Telangana
Vemulawada temple history - Telangana

స్థల పురాణం

పూర్వం రాక్షసులకూ దేవతలకూ జరిగిన ఓ సంగ్రామంలో ఇంద్రుడు రాక్షస రాజైన వృత్తాసురుడు అనే బ్రాహ్మణుడిని వధిస్తాడు.

దేవతల గురువైన బృహస్పతి, ముల్లోకాల్లోకెల్లా ప్రసిద్ధమైన రాజరాజేశ్వరీస్వామి క్షేత్రం లోని ధర్మగుండంలో స్నానమాచరించి, స్వామిని దర్శించుకుంటే బ్రహ్మహత్యాపాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పడంతో ఇంద్రుడు ఆ విధంగా చేసినట్లు ఓ పురాణ కధనం. సూర్యభగవానుడు సైతం ఇక్కడి స్వామిని పూజించడం ద్వారా తన వ్యాధిని నయం చేసుకున్నట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. మహిషాసుర వధ అనంతరం దుర్గాదేవి ఇక్కడి గుండంలో స్నానమాచరించడంతో ముక్కోటి నదీదేవతలు ఈ ధర్మగుండంలో కలిసిపోయాయన్నది మరో కథనం.

వనవాసంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ గుండంలో స్నానమాచరించి స్వామిని పూజించాడనీ, ఆ తరవాత ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడ పూజలు చేశారనీ పౌరాణిక గాథల ద్వారా తెలుస్తోంది.

చరిత్రలోకి వస్తే- క్రీ.శ. 750 - 973 మధ్య కాలానికి చెందిన రాజరాజ నరేంద్ర, చర్మవ్యాధులతో బాధపడుతూ ఇక్కడి ధర్మ గుండంలో స్నానమాచరించడంతో వ్యాధులన్నీ నయమయ్యాయనీ దాంతో ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడనీ చెబుతుంటారు.

నిత్యపూజలు:

హిందూ దేవాలయాల్లో మరెక్కడా కనిపించని కొన్ని పూజలు ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యాన్ని చేకూరుస్తున్నాయి. రాజన్న క్షేత్రంలో కోడె మొక్కుల్ని చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. శివుడి వాహనమైన నంది (కోడె)ని ధర్మదేవతగా భావించి గర్భగుడి చుట్టూ కోడెలను కట్టేస్తుంటారు. మహా లింగార్చన పూజ ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఆలయంలో కొలువైన 366 దేవతలను స్మరిస్తూ 366 మట్టిలింగాలను 15 ఆవరణల్లో పేర్చి, మంత్రోచ్చారణలతో లింగార్చన చేస్తారు. ఏడాదిలో ఒక్కసారి మహాలింగార్చన చేస్తే చాలు, ఆ సంవత్సరమంతా శివుణ్ణి పూజించిన ఫలితం ఉంటుందని లింగపురాణం చెబుతోంది.

ఆలయంలో అద్దాల మండపంలో లింగార్చన కార్యక్రమం ఉంటుంది. వేములవాడ ఆలయంలో మరో రెండు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఒకటి అన్నపూజ. రైతులు తమకు అందిన తొలి పంటతో అన్నాభిషేకం చేస్తుంటారు. దీనివల్ల అధికపంటలు పండి సమస్త జగానికీ ఆహారం అందుతుందన్నది ఓ నమ్మకం. మరొకటి ఆకుపూజ. తమలపాకుతో స్వామివారిని అభిషేకిస్తారు. ఈ రెండు రకాల పూజలు మరే ఆలయంలోనూ జరగవు. అందుకే వాటికోసం ప్రత్యేకంగా ఈ వేములవాడ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. వీటితో పాటు శివకళ్యాణం నిత్యం జరుపుతారు. భక్తులు ఎప్పుడైనా శివకళ్యాణం చేసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మూడురోజులపాటు జాతర ఉంటుంది. అదే తరహాలో శ్రీ సీతారామకళ్యాణం కూడా జరుగుతుంది. పేరుకు శైవక్షేత్రమైనప్పటికీ ఇక్కడ శ్రీసీతారాములు కూడా కొలువై ఉండటంతో కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు. రాజన్న చెంత జరిగే ఆ సీతారామ కళ్యాణ వేడుకకు లక్షల సంఖ్యలో జోగినులు, శివపార్వతులు, హిజ్రాలు హాజరవు తారు. వీరంతా చేతిలో త్రిశూలం పట్టుకుని, నెత్తిన జీలకర్ర, బెల్లం పెట్టుకుని, తలంబ్రాలు పోసుకుంటూ ఆది దేవుడిని పెళ్లాడటం ఇక్కడి ప్రత్యేకత. దేవీనవరాత్రుల సమయం లోనూ కార్తికమాసంలోనూ లక్షలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

హైదరాబాద్ కి సుమారు 150 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 34, వరంగల్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజన్న క్షేత్రం.