వైకుంఠ ఏకాదశి విశిష్ఠత - Vaikunta Ekadashi Vishishtatha

Vaikunta Ekadashi - Story (విశిష్ఠత )
Vaikunta Ekadashi - Story (విశిష్ఠత )

పరమ పవిత్రమైన ఏకాదశిని 'వైకుంఠ ఏకాదశి' పర్వదినంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశినాడు జరుపుకుంటారు. దీనినే 'ముక్కోటి ఏకాదశి' అని కూడా పేరు. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశినాడు పాల కడలిలో శయనించి యోగనిద్రలో గడిపి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు యోగనిద్ర నుంచి మేల్కొన్నాడు మహావిష్ణువు.

దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. రావణాసురుని బాధలకు తాళలేని దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అపుడాయన ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠం చేరుకున్నాడు. వారంతా కలిసి శ్రీహరిని వేదముల సూక్తములతో పరిపరి విధాల స్తుతించారు. దానితో శ్రీహరి సంతుష్టుడై వారికి తన దర్శనభాగ్యం కలుగచేశాడు.

వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణగాథ కూడా ఉంది. మధుకైటభులను రాక్షసులను విష్ణుభగవానుడు సంహరించినప్పుడు వారు దివ్య రూపధారులై దివ్యజ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడారు. బ్రహ్మాదులెవరైనా నీ లోకం వంటి మందిరం నిర్మించి, ఏకాదశి పండుగ చేసుకొని, నీకు నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున నిన్ను చేరుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు వరమివ్వమని కోరాడు. ఈ విధంగా ముక్కోటి దేవతల బాధలను నివారించిన దవడం వల్ల 'ముక్కోటి ఏకాదశి'గాను భగవంతుని దర్శించుకొను పవిత్రమైన రోజు కావున 'భగవదవలోకన దినము' గాను ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి కొనియాడబడింది.

ప్రతి మాసంలోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతికర మైనది. శుభకరమైనది. అందుకే 'వైకుంఠ ఏకాదశి' గా, 'హరివాసరము' గా ఈ రోజు కీర్తించబడుతుంది. ఈ రోజున సకల దేవతారాధ్యుడు అయిన శ్రీమన్నారాయణుని పాదపద్మములను భక్తిశ్రద్ధలతో అర్చించిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది.

ఏకాదశి నాడు ఏం చేయాలి?

ఏకాదశినాడు ప్రధానంగా ఉ పవాస వ్రతం పాటించాలని పురాణాలు వెల్లడించాయి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఆనాడు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు, నిత్యకర్మలు పూర్తిచేసుకుని విష్ణమందిరానికి వెళ్లి తాను వ్రతమును ఆచరించుటకు నిర్ణయించుకున్నట్లు, ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగునట్లు చేయమని శ్రీహరిని ప్రార్థించవలెను. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుని ధ్యానిస్తూ గడవవలెను ఆనాటి రాత్రి జాగరణ చేయవలెను.

ఈ సమయంలో శ్రీహరి ధ్యానం గానీ, పురాణ పఠనం గానీ చేయవలెను. మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగా నారాయణుడిని పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేయవలెను. అంటే ఉపవాసం ఉండటం ఈనాటి ప్రధాన నియమం. అయితే సంతానం గలవారు ఏమీ తినకుండా ఉండకూడదు. భార్యాభర్తలు కలిసి ఈ వ్రతం చేయడం ఉత్తమం. ద్వాదశినాడు అన్నదానం చేయడం వలన రెట్టింపు ఫలితాలు ఉంటాయని పద్మపురాణం వివరిస్తోంది. అయితే ఉపవాసం చేయలేని వారికి వాయు పురాణం ప్రత్యామ్నాయం సూచించింది.

నక్తం హవిష్యాన్ని నోదవం వా ఫలం తిలా: క్షీరమథాంబు బాజ్యం | యతృంచగవ్యం యదవాపి వాయు: ప్రశస్త మంత్రోత్తర ముత్తరంచ ||

అని వాయు పురాణంలో పేర్కొనబడింది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణము, అదీ చేతకాని సమయంలో పంచగవ్యము అంటే పాలు, పండ్లు, నీరు, నెయ్యి, నువ్వులు, తినవచ్చును. అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్థములు అలా కూడా ఉపవసించ లేని వారు ఒక పొద్దు అంటే ఒకపూట ఆహారం స్వీకరించవచ్చును అని దీని అర్థం. ఈవిధంగా ఉపవాస వ్రతం పాటించడం వల్ల సూర్యచంద్ర గణములో చేసే దానం, అశ్వమేధ యాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వివరించాయి.

వైకుంఠ ద్వార దర్శనం:

వైకుంఠ ఏకాదశినాడు ఆచరించాల్సిన పనుల్లో 'వైకుంఠ ద్వార దర్శనం' ప్రధానమైంది. వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపున ఉన్న ద్వారం తెరుస్తారు. ఈ ద్వారానికే వైకుంఠ ద్వారం అని పేరు. వైకుంఠ ఏకాదశినాడు తెల్లవారు ఝామునే 'వైకుంఠ ద్వారం' ద్వారా వెళ్ళి దైవదర్శనం చేసుకుంటే సర్వ పాపాలూ నశిస్తాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఆళ్వారులలో ఒకరైన నమ్మాళ్వారు ఈ దినమే పరమపదించడం వల్ల వైష్ణవులు దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.

బృహత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛంద సామాహం | మాసానాం మార్గశీర్షిహం ఋతూనాం కుసుమాకర: ||

అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు. 'సామవేదంలో బృహత్సమాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువును నేనే' అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. అలాంటి మార్గశిర మాసంలో శుద్ధఏకాదశి గీతా జయంతి కాబట్టి భగవద్గీతలోని 18 అధ్యాయాలను భక్తులు పారాయణం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పబడుతూ ఉంది. వైకుంఠ ఏకాదశిని పాటించడం ద్వారా అనేక పుణ్యఫలాలను పొందడమే కాదు, ఉపవాస వ్రతం వల్ల మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా వస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు.