కథ (Story) కుందేలు ఉపాయం - The Clever Rabbit - Telugu Story
Telugu Story - The Clever Rabbit
ఓ కుందేలు పిల్ల నీళ్లు తాగుతూ పొరపాటున నదిలో పడిపోయింది. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి మధ్యలో ఉన్న ఓ లంకలో తేలింది. అక్కడ ఎటు మాసినా పచ్చిగడ్డి, చెట్లూ ఉండటంతో ఆహారం కోసం ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది. కానీ మరో ప్రాణి కనిపించకపోయే సరికి దానికి దిగులు పట్టుకుంది.
ఒకరోజు దానికి నీటిలో ఓ మొసలి కని పించగానే ప్రాణం లేచి వచ్చింది. బుర్రలో తళుక్కున ఒక ఉపాయమూ మెరవడంతో దానితో మాటలు కలిపింది. 'నువ్వు కూడా నాలా ఒంటరివేనా?' అని అడిగింది.
ఆ మాటలతో మొసలికి కోపం వచ్చి 'ఈ నదిలో నా కుటుంబం, బంధువులూ, స్నేహితులూ అందరూ ఉన్నారు. నేను కో అంటే కోటిమంది ఇప్పుడే పరిగెత్తుకు వస్తారు తెలుసా' అంది.
'ఏదీ ఒక్కసారి మీ వాళ్లందరినీ పిలుచుకురా చూద్దాం' అని రెచ్చగొట్టింది కుందేలు. మొసలి వెంటనే వెళ్లి తన దండుతో తిరిగి వచ్చి 'ఇప్పుడేమంటావ్' అంది.
కుందేలు వాళ్లందరినీ చూసి 'ఇంతేనా, మీరందరూ? కలిసి పడుకున్నా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు సరిపోరుగా' అంది. మొసలికి రోషం వచ్చి 'అది నిజమో అబద్ధమో ఇప్పుడే నిరూపిస్తాను' అని మొసళ్లను నదిలో వరసగా పడుకోమంది.
అవన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ వంతెన కట్టినట్టుగా పడుకున్నాయి. 'మీరందరూ కలిపి వందమంది కూడా ఉంటారోలేదో' సందేహంగా అంది కుందేలు. 'కావలిస్తే లెక్క పెట్టుకో' అంది మొసలి.
'ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ' అని లెక్కపెడుతూ ఒకదాని వీపు మీద నుంచి మరో దాని మీదకు గెంతుతూ అవతలి ఒడ్డుకి చేరిపోయింది కుందేలు. తన వాళ్లందరినీ చూశాక తనను కుందేలు పొగిడితే వినాలని వెనకే ఈదుకుంటూ వచ్చింది మొసలి. అక్కడ పొట్ట చేత్తో పట్టుకుని విరగబడి నవ్వుతున్న కుందేలును చూసి ఆశ్చర్యపోయింది.
'ఎందుకు నవ్వుతున్నావు' అని అడిగింది కోపంగా. 'నీ తెలివికి. అయినా నీ వాళ్లు ఎంతమంది ఉంటే నాకెందుకు? అమాయకంగా వాళ్లందరినీ తీసుకొచ్చి వారధి కట్టించి మరీ నన్ను ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేర్పించావు.
దేవుడు నీ బుర్రలో మట్టి పెట్టాడు కాబట్టే నేను ఈ ఒడ్డుకు చేరుకోగలిగాను' అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది. తన తెలివి తక్కువతనాన్ని తిట్టుకుంటూ వెనుదిరిగింది మొసలి.