కథ (Story) నిజాయితీకి ప్రతిఫలం - Reward for honesty story in telugu
పూర్వం ఒక రాజు తన ఆస్థానంలో ఖాళీ ఏర్పడిన కోశాధికారి పదవికి అభ్యర్థులను ఆహ్వానించాడు. పదుల సంఖ్యలో అభ్యర్థులు రాగా వారికి అనేక పరీక్షలు పెడితే తుదకు ముగ్గురు మిగిలారు. రాజుగారు బాగా ఆలోచించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె సంచి ఇచ్చి అడవిలోకి వెళ్ళి మీకు దొరికిన పండ్లతో సంచిని నింపి సాయంత్రంలోపు రావలసిందిగా ఆజ్ఞాపించాడు.
వారిలో మొదటివాడు “రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉంటుంది. కనుక మంచి పండ్లను తీసుకువెళ్ళాలి" అనుకొని అడవి అంతా కలియతిరిగి నాణ్యమైన వివిధ రకాల పండ్లను కష్టపడి ఏరి, సంచిని నింపాడు.
రెండవవాడు “రాజుగారికి పండ్లకు కొదవలేదు, మేము తెచ్చేవాటితో అవసరం లేదు. కావున సంచిని నింపితే చాలు" అనుకొని కంటికి కనిపించిన పండ్లను మంచివి, పుచ్చువి అని చూడకుండా సంచిని నింపసాగాడు.
ఇక మూడోవాడు చాలా చతురంగా ఆలోచించాడు. "రాజుగారికి నేను తెచ్చే పండ్లతో పనేముంది. వారికి అనేక పనులుంటాయి, సంచి మొత్తం చూసే తీరిక ఉండదు. అలాంటప్పుడు కష్టపడి అడవి అంతా తిరగాల్సిన పనిలేదు” అనుకొని ఆకులు అలములతో ముప్పావు సంచిని నింపి మిగతా భాగాన్ని పండ్లతో నింపేశాడు.
Telugu Moral Stories for Kids
సాయంత్రానికల్లా ముగ్గురూ తమ పండ్ల సంచులు తీసుకొని రాజుగారి ముందు హాజరయ్యారు. మూడోవాడు ఊహించినట్లే రాజుగారు సంచుల వంక కనీసం చూడనైనా చూడకుండా భటులతో “ఈ ముగ్గురుని వారు తెచ్చిన పండ్ల బస్తాలతో నెలరోజులపాటు విడివిడిగా మూడు గదులలో ఉంచండి. తినడానికి ఏమీ ఇవ్వరాదు. వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం అని ఆజ్ఞాపించాడు.
రాజుగారి అదేశానుసారం ముగ్గురినీ మూడు గదుల్లో ఉంచారు. మొదటివాడు తాను తెచ్చిన నాణ్యమైన పండ్లను వేళకు తింటూ ఎలాంటి ఆకలిబాధలు లేకుండా నెలరోజులు గడిపేశాడు.
రెండవవాడు తాను తెచ్చిన కొన్ని మంచి పండ్లను తిని కొన్నిరోజులు బాగానే ఉన్నాడు. తర్వాత మిగిలిన పుచ్చిన పండ్లు తిని తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు.
ఇక మూడవవాడు పైన నింపిన పండ్లతో వారం రోజులు గడిపి ఆపై సంచిలో ఉన్న ఆకులు అలములు తినలేక ఆకలితో చిక్కిశల్యమైపోయాడు.
గడువు ముగిసాక రాజుగారు ఆ ముగ్గురినీ పిలిపించి 'రాజ్యానికి కావలసింది నిజాయతీపరులు' అని చెప్పి, మొదటి వ్యక్తిని కోశాధికారిగా నియమించాడు.
నీతి (Moral)
1. మనం చేస్తున్న పనిని ఎవరూ పర్యవేక్షించక పోయినా శ్రద్ధతో చేయాలి. 2. నిజాయతీతో పనిచేస్తే సత్ఫలితం తప్పకుండా లభిస్తుంది.