కథ (Story) అతి గారాబం పనికిరాదు - Athi garabam - Telugu Story
Telugu stories - Kothi Rakumarudu
చంద్రగిరిని పాలించే విక్రమసేనుడికి లేకలేక కుమారుడు జన్మించాడు. ఆ రాకుమారుడిని గారాబంగా పెంచారు. విపరీతమైన గారాబం వల్ల అతడు పెంకివాడిలా తయారయ్యాడు. విద్యాభ్యాస సమయాన్నీ ఆటపాటలకు వినియోగించేవాడు. ఒక రోజు అతడికి కోతిపిల్ల కనిపించింది. దాన్ని కోటకు తెచ్చుకుని రోజంతా దానితోనే గడిపేవాడు.
రాకుమారుడిని అనుసరిస్తూ కోతి కొన్ని పనులు చేసేది. దాంతో ఎంతో ముచ్చటపడి దానికి కర్ర సాము చేయడంలో శిక్షణ ఇప్పించాడు. తల్లీతండ్రీ ఎంత వారించినా వినకుండా దానికి కత్తి పట్టడం కూడా నేర్పించాడు. ఒకరోజు 'నిన్ను నా అంగరక్షకుడిగా నియమిస్తున్నాను. ఇక నుంచీ నా మీద ఈగ వాలినా నీదే బాధ్యత, సరేనా?' అన్నాడు. అలాగేనంటూ కోతి బుద్దిగా తల ఊపింది. తర్వాత కాసేపు కోతితో ఆటలాడిన రాకుమారుడు అలిసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. ఈలోగా ఒక ఈగ వచ్చి రాకుమారుడి చేతి మీద వాలింది.
కోతి గటిగా అరిచేసరికి ఈగ ఎగిరిపోయింది కానీ రాకుమారుడికి మెలకువ వచ్చేసింది. తను నిద్రపోతున్నపుడు అలా అరిచి నిద్రాభంగం చేయవద్దని చెప్పి మళ్లీ నిద్రపోయాడు. కాసేపటి తర్వాత ఈగ మళ్లీ వచ్చి రాకుమారుడి చేతి మీద వాలింది. ఏంచేయాలో తెలియక కోతి ఆలోచనలో పడింది. అప్పుడు దానికి 'నా మీద ఈగ వాలకుండా చూడాల్సిన బాధ్యత నీదే' అన్న రాకుమారుడి మాటలు గుర్తొచ్చాయి. మరోపక్క 'గట్టిగా అరిచి నిద్రాభంగం చేయవద్దు' అని రాకుమారుడు హెచ్చరించిన సంగతీ గుర్తొచ్చింది. అందుకని అరవకుండానే ఈగను చంపాలనుకుంది.
వెంటనే రాకుమారుడి చేతి మీదున్న ఈగను కత్తితో పొడిచింది. కత్తి దూసిన విసురుకి ఈగ ఎగిరిపోయింది. రాకునూరుడి చెయ్యి తెగిపడింది. దాంతో విచక్షణా జ్ఞానంలేని కోతికి కత్తి పట్టడం నేర్పించడం ఎంత బుద్ధి తక్కువ పనో రాకుమారుడికి తెలిసివచ్చింది.
నీతి:
1) అతి గారాబం తెలివితక్కువ వాళ్ళని చేస్తుంది. 2) అర్హత లేనివారికి అధికారాన్ని ఇవ్వరాదు.