కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం -Karmanghat Hanuman Temple – A Spiritual Legacy of Hyderabad
Karmanghat Hanuman Temple – A Spiritual Legacy of Hyderabad
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సాగర్రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉంది శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం భాగ్యనగరంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో శ్రీ ధ్యానాంజనేయస్వామి దేవాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యానాంజనేయునిగా నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయానికి ఔరంగజేబు వల్ల కర్మన్‌ఘాట్ ఆంజనేయుడన్న పేరొచ్చిందంటారు.
క్రి.శ 1143 ప్రాంతంలో రాజు ప్రతాపరుద్రుడు సైన్యంతో వేట కోసం లక్ష్మీగూడెం గ్రామం(ఇప్పటి కర్మన్ ఘాట్) మీదుగా అడవిలోకి వెళ్లాడు. రోజంతా వేటాడి అలసిసొలసి ఓ చెట్టు కింద విశ్రమించిన ఆయనకు పులి అరుపు వినిపించింది. వెంటనే దాన్ని వేటాడడానికి రాజు అరుపు విన్పించినవైపు వెళ్లాడు. ఎంత దూరం వెళ్లినా అరుపు విన్పిస్తోందే తప్ప పులి కనిపించలేదు. దాంతో అలసిన రాజు ఓచోట నిలిచి నిశితంగా పరిసరాలను గమనించాడు. ఓ చెట్ల గుబురులో నుంచి ఆయనకు రామనామం వినిపించింది. దట్టమైన అడవిలో దైవధ్యానం చేస్తున్నదెవరా అని ఆశ్చర్యపోయిన రాజు నెమ్మదిగా గుబురు తొలగించి చూశాడు.
అక్కడ పద్మాసనంలో ధ్యానముద్రలో దివ్యతేజో ప్రభలతో వెలుగొందుతున్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి ప్రతిమ కనిపించింది. అది చూసిన రాజు శ్రీ ధ్యానాంజనేయ ప్రతిమ కనిపించిన స్థలం లోనే స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి స్వామి వారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. కర్మన్ ఘాట్ గ్రామం అసలు పేరు లక్ష్మీ గూడెం. మొఘలుల పాలనలో ఔరంగజేబు సామ్రాజ్య విస్తరణకు నలుదిశలా సైన్యాన్ని పంపాడు.
అలా హైదరాబాద్ చేరుకున్న ఓ సైన్య బృందం దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించగా ప్రహరీ గోడను కూడా తాకలేకపోయిందట. వారు తిరిగి వెళ్లి విషయం చెప్పగా ఆశ్చర్యపోయిన ఔరంగ జేబు తానే స్వయంగా ఆలయం ధ్వంసం చేయడానికి పలుగు పట్టుకుని సింహద్వారంవద్దకు చేరుకున్నాడు. ఇంతలోనే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వినిపించింది. ఆకాశవాణి ఇలా హెచ్చరించింది 'హే రాజన్ మందిర్ తోడా హై తో పహలె తుమ్ కరో మన్ ఘట్' (ఓ రాజా! నా ఆలయం ధ్వంసం చేయాలనుకుంటే ముందు నువ్వు గుండె ధైర్యం తెచ్చుకో.).
ఆ మాటలు విన్న ఔరంగజేబు 'హే భగవాన్ నీలో సత్యముంటే అది నాకు చూపించు' అని స్వామిని కోరాడనీ తాటిచెట్టు ప్రమాణంలో మెరుపులాగా స్వామి కనిపించాడనీ చరిత్ర చెబుతోందికర్మన్‌ఘాట్ ఘట్ అన్న మాటే కాలక్రమంలో ‘కర్మన్‌ఘాట్గా మారిందని స్థానికుల అభిప్రాయం.