భగవద్గీత - శ్లోకం 19: న ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ | నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0019
శ్లోకం 19:
న ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ | నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్ ||
ప్రతిపదార్థం:
ఘోషః = ధ్వని; ధార్తరాష్ట్రాణాం = ధృతరాష్ట్రుని కుమారుల; హృదయావి = హృదయములను; వ్యచారయత్ = భేదించెను; నభః చ = ఆకాశమును; పృథివీం = భూమిని; చ = కూడా: ఏవ = నిశ్చయముగా, తుములు = మిక్కిలి భీకరముగా; అభ్యసునాదయన్ = ప్రతిధ్వనింపజేయుచు;
తాత్పర్యం:
ఆ వివిధశంఖముల ధ్వని అతిభీకరమయ్యెను. భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను.
భాష్యము:
దుర్యోధనుని పక్షమున భీష్మాదులు శంఖధ్వానములు చేసినప్పుడు పాండవపక్షమువారి హృదయములు భేదింపబడలేదు. అట్టి సంఘటనలేవియును ప్రస్తావించబడలేదు. కాని పాండవపక్షపువారు కావించిన ధ్వనులతో ధృతరాష్ట్రుని తనయుల హృదయములు బ్రద్దలాయెనని ఈ శ్లోకమున తెలుపబడినది. పాండవులకు శ్రీకృష్ణభగవానుని యందు గల విశ్వాసమే అందులకు కారణము. దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చినవాడు ఎట్టి ఘోరవిపత్తునందైనను భయము నొందవలసిన అవసరము లేదు.