భగవద్గీత - శ్లోకం 16-18: అనన్తవిజయం రాజా కుస్తీపుత్రో యుధిష్ఠిరః | నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0016-0018
శ్లోకం 16 - 18:
అనన్తవిజయం రాజా కుస్తీపుత్రో యుధిష్ఠిరః | నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ || కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణీ చ మహారథః | ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః || ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||
ప్రతిపదార్థం:
అవన్తవిజయం = అనంతవిజయనామక శంఖమును, రాజా = రాజైన; కుస్తీపుత్రః = కుంతీపుత్రుడగు; యుధిష్ఠిరః = ధర్మరాజు, నకులః = నకులుడు, సహదేవః = సహదేవుడు; చ = మరియు; సుఘోషమణిపుష్పకౌ = సుఘోషము మరియు మణిపుష్పకము అనెడి నామములు గల శంఖములను; కాశ్య: = కాశీరాజును; చ = మరియు, పరమేష్వాసః = గొప్ప విలుకాడైన; శిఖండీ చ = శిఖండీయు; మహారథః: = ఒంటరిగా వేలకొలది యోధులతో పోరాడగల వీరుడును; ధృష్టద్యుమ్న: = ద్రుపదుని కుమారుడగు ధృష్టద్యుమ్నుడును; విరాటః చ = పాండవులకు అజ్ఞాతవాసమున ఆశ్రయమొసగిన విరాటరాజును; సాత్యకి: = సాత్యకి (శ్రీకృష్ణుని రథసారథియైన యుయుధానుడు); చ = మరియు; అపరాజితః = పరాజయమున్నది ఎరుంగనివాడగు; ద్రుపదః = పాంచాల రాజగు ద్రుపదుడు; ద్రౌపదేయా: చ = ద్రౌపదికుమారులును; సర్వశః: = అందరు: పృథివీపతే = ఓ రాజా; సౌభద్రః చ = సుభద్రా తనయుడైన అభిమన్యుడును; మహాబాహుః = గొప్ప భుజపరాక్రమము కలవాడు; శంఖాన్ = శంఖములను; దధ్ము: = ఊదిరి; పృథక్ పృథక్ = వేరువేరుగా;
తాత్పర్యం:
ఓ రాజా! కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంతవిజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదితనయులు, గొప్ప బాహువులు గలిగిన సుభద్రాతనయుడు మున్నగు వీరులందరును తమ తమ శంఖములను పూరించిరి.
భాష్యము:
పాండుతనయులను మోసము చేయుట మరియు రాజ్యసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్ట యత్నించుట యనెడి అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రునకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు. కురువంశమంతయు ఆ మహారణమునందు సంహరింపబడు ననెడి సూచనలు స్పష్టముగా లభించినవి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుమలైన అభిమన్యుని వంటివారివరకు సర్వులు (ప్రపంచ పలుదేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా) అచ్చట నిలిచియుండిరి. వారందరును నశింపనున్నారు. తన కుమారులు అనుసరించిన యుక్తి విధానమును ప్రోత్సహించియున్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోరవిపత్తుకు కారణమై యున్నాడు.