భగవద్గీత - శ్లోకం 15: పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః | పౌణ్డం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

శ్లోకం 15:

Bhagavad Geetha - Telugu - Sloka - 0015

Bhagavad Geetha - Telugu - Sloka - 0015

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః | పౌణ్ణం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

ప్రతిపదార్థం:

పాంచజన్యం = పాంచజన్యమను పేరు గల శంఖము; హృషీకేశః = శ్రీకృష్ణభగవానుడు (భక్తుల ఇంద్రియములను నియమించు శ్రీకృష్ణుడు); దేవదత్తం = దేవదత్తమను పేరు గల శంఖమును; ధనంజయః = ధనంజయుడు (ధనమును జయించిన అర్జునుడు); పౌణ్డం = పౌణ్డమను పేరు గల శంఖమును; దధ్మౌ = ఊదిరి; మహాశంఖం = భయంకరమైన శంఖమును; భీమకర్మా = ఘనకార్యములు చేయువాడు; వృకోదరః = భోజనప్రియుడు (భీముడు).

తాత్పర్యం:

శ్రీకృష్ణభగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజనప్రియుడును, ఘన కార్యములను చేయువాడును అగు భీముడు పౌండ్రమనెడి తన మహా శంఖమును ఊదెను.

భాష్యము:

సర్వేంద్రియములకు ప్రభువైనందునే శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషీ కేశుడని తెలుపబడినాడు. జీవులందరును అతని అంశలు గావున జీవుల ఇంద్రియములు సైతము అతని ఇంద్రియముల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి తెలియలేనందున వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపగోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. కాని అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును.

శుద్ధభక్తుని విషయమున ఆతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును. ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్యేంద్రియములను ప్రత్యక్షముగా నియమించుటచే శ్రీకృష్ణభగవానునికి ప్రత్యేకముగా "హృషీకేశుడు" అనెడి నామము వాడబడినది. వివిధకార్యములను అనుసరించి భగవానుడు వివిధనామములను కలిగియుండును. ఉదాహరణమునకు మధువనేడి రాక్షసుని సంహరించుట వలన అతనికి మధుసూదనుడనెడి నామము కలిగెను. గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందము నొసగును కనుక "గోవిందుడు" అనెడి నామము కలిగెను. వసుదేవుని తనయుడై ఆవిర్భవించినందున "వాసుదేవుడు" అనెడి నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించినందున "దేవకీనందన" అనెడి నామము కలిగెను. బృందావనమున యశోదకు బాల్యలీలలను దర్శించు అవకాశమొసగినందున “యశోదనందన” అనెడి నామము కలిగెను. స్నేహితుడైన అర్జునునకు సారథిగా వర్తించుట వలన "పార్థసారథి" యను నామము కలిగెను. అదేవిధముగా కురుక్షేత్రరణరంగమున అర్జునునకు నిర్దేశము నొసగుట వలన "హృషికేశుడు" అను నామము కలిగెను.

వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరపడినపుడు దానిని సంపాదించుటలో అగ్రజునికి సహాయపడినందున ఈ శ్లోకమున అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినాడు. అదేవిధముగా భీముడు వృకోదరునిగా తెలుపబడినాడు. విపరీతముగా తినుటయే గాక దానికి తగినట్లు హిడింబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులకు కారణము. ఈ విధముగా భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులు పూరించిన వారి ప్రత్యేక శంఖములు పాండవపక్షవీరులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షములో అట్టి ఘనతలు గాని, దివ్యనిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని, లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అనగా వారు రణమున ఓడిపోవుట నిశ్చయింపబడియే ఉన్నది. ఆ సందేశమే శంఖధ్వానముల ద్వారా ప్రకటింపబడినది.