భగవద్గీత - శ్లోకం 14: తతః శ్వేతైర్హ యైర్యు క్తే మహతి స్యన్దనే స్థితౌ | మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖా ప్రదధ్మతుః ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0014
శ్లోకం 14:
తతః శ్వేతైర్హ యైర్యు క్తే మహతి స్యన్దనే స్థితౌ | మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖా ప్రదధ్మతుః ||
ప్రతిపదార్థం:
తతః = పిమ్మట; శ్వేతై: = తెల్లని; హయైః = గుఱ్ఱములు; యుక్తే = పూన్చబడిన; మహతి = మహా; స్యన్దనే = రథమునందు; స్థితౌ = ఉన్నవారై; మాధవః = కృష్ణుడును (లక్ష్మీపతి); పాణవః = అర్జునుడు (పాండురాజు తనయుడు), చ = కూడా; ఏవ = నిశ్చయముగా, దివ్యౌ = దివ్యములైన; శంభో = శంఖములను; ప్రదధ్మతుః = పూరించిరి.
తాత్పర్యం:
ఎదుటి పక్షమున శ్రీకృష్ణభగవానుడు, అర్జునుడు ఇరువురును తెల్లని గుఱ్ఱములు పూన్చబడిన మహారథమునందు ఆసీనులైనవారై తమ దివ్యశంఖములను పూరించిరి.
భాష్యము:
శ్రీకృష్ణార్జునుల హస్తములందలి శంఖములు భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా దివ్యములని వర్ణింపబడినవి.
శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియున్నందున ప్రతిపక్షమువారికి జయమనెడి ఆశయే లేదని ఆ దివ్యశంఖముల ధ్వని సూచించినది.
“జయస్తు పాణ్డుపుత్రాణాం యేషాం పక్షే జనార్ధనః" - శ్రీకృష్ణభగవానుడు తన సాహచర్యము నొసగెడి కారణమున విజయము సదా పాండుపుత్రులకే లభించగలదు.
భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అచ్చట లక్ష్మీదేవి సైతము నిలిచియుండును. ఏలయన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడును ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యము అనునవి అర్జునుని కొరకు వేచియున్నవి.
ఇదియే గాక మిత్రులిరువురు ఆసీనులై యున్న రథము అగ్నిదేవునిచే అర్జునునకు ఒసగబడినట్టిది. ముల్లోకములలో అన్ని దిక్కులను అది జయించు సామర్థ్యమును కలిగియున్నదని ఈ విషయము సూచించుచున్నది.