భగవద్గీత - శ్లోకం 12: తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః | సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0012
శ్లోకం 12:
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః | సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
ప్రతిపదార్థం:
తస్య = అతనికి; సంజనయన్ = వృద్ధిచేయుచు; హర్షం = సంతోషమును; కురువృద్ధః = కురువంశమున వృద్ధుడును (భీష్ముడు); పితామహః పితామహుడును; సింహనాదం = సింహగర్జన వంటి ధ్వనిని; వినద్య = కలుగునట్లుగా; ఉచ్చైః = బిగ్గరగా; శంఖం = శంఖమును; దధ్మౌ = ఊదెను; ప్రతాపవాన్ = పరాక్రమవంతుడును;
తాత్పర్యం:
అప్పుడు కురువృద్ధుడును, యోధుల పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను.
భాష్యము:
కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయమందలి భావనను అవగతము చేసికొనగలిగెను. అంతట దుర్యోధనుని యెడ గల సహజకరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లు అతిబిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనునికి (మనుమనికి) పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికిని యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమై యున్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు.