భగవద్గీత - శ్లోకం 11: అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః | భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0011
శ్లోకం 11:
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః | భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి ||
ప్రతిపదార్థం:
అయనేషు = ముఖ్యస్థానములందు; చ = కూడా; సర్వేషు = సర్వత్రా; యథాభాగం = వివిధముగా ఏర్పాటు చేయబడినట్లు; అవస్థితాః = ఉన్నవారై; భీష్మమ్ = పితామహుడైన భీష్మదేవునికి; ఏవ = నిశ్చయముగా; అభిరక్షన్తు = రక్షణము కూర్చవలెను; భవన్తః = మీరు; సర్వే = అందరును; ఏవ హి = నిశ్చయముగా;
తాత్పర్యం:
సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖ్యస్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసియున్నది.
భాష్యము:
భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగినవారిగా తలతురేమోనని భావించెను. తత్కారణముగా తన సహజ రాజనీతి ధోరణిలో అతడు పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ యత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్పవీరుడే అయినను వృద్ధుడైనందున ప్రతియొక్కరు అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలెనని అతడు వక్కాణించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనపుడు ఒకే ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసికొనగలరు.
కనుక ఇతర వీరులందరును తమ ముఖ్యస్థానములను వీడకుండుట మరియు సేనావ్యూహమును శత్రువు భేదించుటకు అవకాశ మీయకపోవుట అతి ముఖ్యమై యున్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడియున్నదని దుర్యోధనుడు స్పష్టముగా తలచెను. యుద్ధమందు భీష్ముడు మరియు ద్రోణాచార్యుని పూర్ణ సహకారము నెడ అతడు పూర్ణ విశ్వాసమును కలిగియుండెను. సభలో మహా సేనానాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసెడి సమయమున అర్జునుని భార్యయైన ద్రౌపది నిస్సహాయస్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినపుడు వారు ఒక్కమాటైనను పలుకలేదని అతడెరుగుటయే అందులకు కారణము. ఆ ఇరువురు సేనానులు పాండవుల యెడ ఏదియో ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికిని పాచికల సమయమున గావించినట్లు వారిపుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను.