భగవద్గీత - శ్లోకం 10: అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ | పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

Bhagavad Geetha - Telugu - Sloka - 0010
Bhagavad Geetha - Telugu - Sloka - 0010

శ్లోకం 10:

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ | పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

ప్రతిపదార్థం:

అపర్యాప్తం = అపరిమితమైన; తత్ = అది; అస్మాకం = మనయొక్క; బలం = సైన్యబలము; భీష్మాభిరక్షితమ్ = భీష్మునిచే లెస్సగా రక్షింపబడునది; పర్యాప్తం = పరిమితమైన; తు = కాని; ఇదం = ఈ; ఏతేషాం = పాండవుల యొక్క; బలం = సైన్యబలము; భీమాభిరక్షితం = భీమునిచే జాగరూకతతో రక్షింపబడునది;

తాత్పర్యం:

మన సైన్యబలము లెక్కింప వీలులేనిదిగానున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది.

భాష్యము:

ఇచ్చట దుర్యోధనుడు ఇరుసేనాబలముల తులనాత్మక అంచన వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనానియైన భీష్మపితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్యబలము అపరిమితముగానున్నట్లు అతడు భావించెను. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడగు సేనానియైన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము పరిమితముగానున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయను కలిగియుండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగియుండుటయే అందులకు కారణము. కాని అదే సమయమున పరమోత్తమ సేనానియైన భీష్ముని సన్నిధిని తలచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను. యుద్ధరంగమున తాను విజయము సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను.