భగవద్గీత - శ్లోకం 9: అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః | నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0009
శ్లోకం 9:
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః | నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||
ప్రతిపదార్థం:
అన్యే = ఇతరులు; చ = కూడా; బహవః = బహుసంఖ్యలో; శూరాః = వీరులు; మదర్థే = నా కొరకు; త్యక్తజీవితాః = జీవితమును కూడా విడుచుటకు సిద్ధపడినవారు; నానాశస్త్ర ప్రహరణాః = పలువిధములైన ఆయుధములను దాల్చినవారు; సర్వే = అందరును; యుద్ధవిశారదాః = యుద్ధనిపుణత కలవారు;
తాత్పర్యం:
నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలువిధములైన ఆయుధములను దాల్చినవారును మరియు యుద్ధనిపుణతను కలిగినవారును అయియున్నారు.
భాష్యము:
జయద్రదుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై యున్నారు. వేరుమాటలలో పాపియైన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరును మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయింపబడినది. కాని దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను.