భగవద్గీత - శ్లోకం 8: భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0008
శ్లోకం 8:
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||
ప్రతిపదార్థం:
భవాన్ = మీరు; భీష్మ: = పితామహుడైన భీష్ముడు; చ = కూడా; కర్ణ = కర్ణుడు; చ = మరియు; కృపః = కృపుడును; చ = మరియు; సమితింజయః = యుద్ధమునందెప్పుడును జయశీలురైన; అశ్వత్థామా = అశ్వత్థామయు; వికర్ణ: = వికర్ణుడును; చ = కూడా; సౌమదత్తి: = సోమదత్తుని కుమారుడు; తథా = ఆలాగుననే; ఏవ = నిశ్చయముగా, చ = కూడా;
తాత్పర్యం:
యుద్ధమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.
భాష్యము:
యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖవీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లికరాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునుని సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. (మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.)