భగవద్గీత - శ్లోకం 3: పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
Bhagavad Geetha - Telugu - Sloka - 0003
శ్లోకం 3:
పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
ప్రతిపదార్థం:
పశ్య = చూడుము; ఏతాం = ఈ; పాణ్డుపుత్రాణాం = పాండురాజు కుమారుల యొక్క; ఆచార్య = ఓ గురువర్యా; మహతీం = గొప్పదైన; చమూమ్ = సైన్యమును; వ్యూఢాం = ఏర్పాటు చేయబడిన; ద్రుపదపుత్రేణ = ద్రుపద తనయునిచే; తవ = మీ యొక్క; శిష్యేణ = శిష్యుడు; ధీమతా = మిగుల బుద్ధిమంతుడైన;
తాత్పర్యం:
ఓ ఆచార్యా! మీ బుద్ధికుశలుడైన శిష్యుడగు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము.
భాష్యము:
బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతియునైన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూప నెంచెను. ద్రౌపది (అర్జునుని భార్య) జనకుడైన ద్రుపదమహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయవైరమును కలిగియుండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞము నాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను ద్రుపద తనయుడైన ధృష్టద్యుమ్నుడు యుద్ధవిద్యను నేర్చుటకై తన చెంతకు చేరినపుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధరహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు.
ఇపుడు ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేనా వ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీధోరణి లేని యుద్ధము చేయవలెనను ఉద్దేశ్యముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను.
ప్రియతమ శిష్యులైన పాండవుల యెడ యుద్ధరంగమున అతడు అదేవిధముగా మృదుస్వభావముతో ప్రవర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశ్యమై యుండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడు మరియు తెలివిగలవాడు అయిన శిష్యుడు.
యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారితీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను.