ఏ ఫిలాసఫీని నమ్మకపోవటమే అసలైన ఫిలాసఫీ - ఉప్పలూరి గోపాల కృష్ణమూర్తి (UGK)
ఉప్పలూరి గోపాల కృష్ణమూర్తి (UGK)
మీకు బోధించడానికి నా దగ్గర ఏమీ లేదు.. దాచుకోవటానికీ ఏమి లేదు.
నా మాటలు మీరు వింటున్నారు అంటే మీకేదో ఉపయోగపడుతుందనే కదా.. క్షమించండి, మీరేమీ అనుకోవద్దు.. అలాంటి బోధనలూ, ప్రవచనాలూ నా దగ్గర ఏమి లేవు. నేను మాట్లాడే పొంతనలేని వాక్యాలు తప్ప! దీంట్లోనే మీకేదో అనిపిస్తుంది, కనిపిస్తుంది అంటే.. అదంతా మీరు చెప్పుకునే అన్వయమే తప్ప నా మాటల గొప్పతనం కాదండి.
అందుకే నేను చెప్తున్నా, నా భావాలకు మాటలకు ఎలాంటి కాపీరైట్స్ హక్కులు లేవు, ఇకపై కూడా ఉండవు. వీటిని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోండి, మార్చుకోండి, పూర్తిగా మీవే అని చెప్పుకోండి, నాకేమి అభ్యంతరం లేదు, నాకే కాదు నేను చెప్పే భావాలమీద ఎవరికీ కాపీరైట్స్ ఉండవు కూడా..
హక్కులు అని ప్రత్యేకంగా చెప్పాలంటే నా భావాలమీద ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికి హక్కులుంటాయి, ఇక మీ ఇష్టం.
మీరు మీ కాళ్ళ మీద నిలబడి నడవగలరు అని చెప్పటమే నా ఉద్దేశ్యం.
దయచేసి, దయచేసి మీ ఊతకర్రలన్నీవిసిరి పారేయండి! మీరు నిజంగా వికలాంగులైతే సరే ఎవరో ఒకరిమీద ఆధారపడక తప్పదనుకోండి! అయితే మీరు గమనించాల్సింది ఒకటుంది. మీరు వికలాంగులు అని చాలామంది మిమ్మల్ని నమ్మిస్తున్నారు! మా బోధనలు, మా పుస్తకాలు, మా ప్రవచనాలు వినండి కొనండి మీరు బాగుపడతారు అని మిమ్మల్ని ఒప్పిస్తున్నారు.. అన్నిటిని విసిరేయండి.. మీకు కావాల్సిందంతా మీలోనే ఉంది. మీ కాళ్ళ మీద మీరు నడవగలరు.. నేను చెప్పేది ఇదే!
నేను పడిపోతే? అనుకుంటున్నారా.. అదంతా మీ భయం. ఎవరి సహాయం లేకుండా నడవండి మీరు పడిపోరు.
నేను జ్ఞానోదయం పొందినవాడిని అని నా గురించి చాలామంది అనుకుంటూ ఉంటారు.. అలాంటిదేమీ లేదు.. నమ్మకండి.
నేను జ్ఞానోదయం పొందటానికి ప్రయత్నించి ప్రయత్నించి చివరకు జ్ఞానోదయం అనేది ఎక్కడ లేదు అని తెలుసుకున్నాను.. ఉన్నదల్లా నేను మీరు మాత్రమే..
చాలామంది నాకు జ్ఞానోదయం అయింది, మీకు జ్ఞానబోధ చేస్తాను అంటుంటారే వాళ్ళని అస్సలు నమ్మకండి.. వాళ్లంతా ప్రజల అమాయకత్వం మీద బ్రతికే స్వార్థపరులు.
మనిషి బయట ఏ రకమైన శక్తిలేదు, మనిషే భయంనుంచి దేవుణ్ణి సృష్టించాడు, అసలు సమస్య భయమే తప్ప దేవుడు కాదు.
ఈ మతగురువులు, మానసిక శాస్త్రవేత్తలు మీకు చూపించిన అనేక పరిష్కారాలు నిజమైన పరిష్కారాలు కావు, ఇది మనకి తెలిసినా అంగీకరించలేని బలహీనత వాళ్ళ బోధనలకు లొంగిపోయే బలహీనత.
ఇంకా ప్రయత్నించండి, వినయంతో ఉండండి, ధ్యానం చేయండి, తల కిందులుగా తపస్సు చేయండి ఇలా ఏవేవో చెప్తుంటారు కదా.. వాళ్ళు అంతకు మించి ఏమి చేయలేరు.. ఏమి ఇవ్వలేరు. మీ ఆశలు, భయాలు, అమాయకత్వం పక్కనపెట్టి వాళ్ళందరిని వ్యాపారులుగా చూడగలిగితే వల్లిస్తానన్నవేమీ ఇవ్వలేరు అని మీకు తెలుస్తుంది.
ఈ సో కాల్డ్ బోధకులు అమ్మే నకిలీ సరుకుల్ని కొంటునే ఉంటాం మనం.
ఒక వేదిక మీద కూర్చొని మాట్లాడటం అనేది నేనెప్పటికీ చేయలేను. చాలా ఆర్టిఫిషల్ గా అనిపిస్తుంది. ఒక పీఠం మీద కూర్చొని అర్ధం కానీ పదాలతో, ఊహాజనితమైన అంశాలు మాట్లాడటం అంటే సమయం వృధా చేయటమే అని నా అభిప్రాయం.
ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. మీరు సంతోషాన్ని వెతుకున్నంతకాలం అసంతుష్టులుగానే అసంతృప్తితోనే మిగిలిపోతారు.
అసలు వాస్తవం ఏమిటంటేనండి, మీకు సమస్యలు ఏమి లేనపుడు ఎదో ఒక సమస్యని సృష్టించుకుంటారు. ఏ సమస్య లేకపోతే ఇదీ ఒక జీవితమేనా అనుకుంటారు.
ప్రపంచాన్ని ఎక్కువగా పీడించిన, పీడిస్తున్న ఆధ్యాత్మిక మత కాలుష్యంతో పోలిస్తే వాతావరణ కాలుష్యం చాలా తక్కువ హానికరం.
నా చుట్టూ తిరిగితే మీకేదో దొరుకుతుందని మిమ్మల్ని మీరు ఫూల్స్ ని చేసుకుంటున్నారు. మీకెలా చెప్పాలి? నిజంగా నా దగ్గర మీకేమీ దొరకదు. ఎందుకంటే అసలు నిజం ఏమిటంటే ఎవరి నుంచి ఏది మీరు పొందాల్సిన అవసరం లేదు, ఉండాల్సిందంతా మీ లోనే ఉంది, ఆ విషయం ఒక్కటే మీరు తెలుసుకోవాలి.
These are the unrational ideas of a man called UGK (ఉప్పలూరి గోపాల కృష్ణమూర్తి)