మరాఠా యోధుడు - ఛత్రపతి శివాజీ - అయన మతాభిమానే కానీ మతదురభిమాని కాడు.


Chathrapathi Shivaji

స్వామి వివేకానంద 'ప్రాచ్యం-ప్రశ్చాత్వం' అనే పుస్తకంలో ఇలా అంటారు: "క్రీస్తు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమన్నాడు. కృష్ణుడేమో ధర్మం కోసం యుద్ధానికైనా వెనుకాడొద్దని అన్నాడు.కానీ విచిత్రంగా క్రీస్తుని అనుసరించే పాశ్చాత్య దేశాలేమో కన్నుకు కన్ను పన్నుకు పన్ను సిద్థాంత్వాన్ని ఇష్టపడతాయి. మనమేమో అహింసను పరమధర్మాంగ భావిస్తాం!" అందుకే కనీసం పక్క రాజ్యంపై దండెత్తాలని కలలో సైతం భావించని అఖండ భారతావని వేలయేళ్ళ పాటు బానిసత్వంలో మగ్గిపోయిoది. అందులోనూ తనెంతోగానో ప్రేమించి పూజించే మతం ప్రాణాలు కాపాడుకోవడానికి అష్టకష్టాలూ పడింది.

ఏమైనా హైందవ ధర్మ పరిరక్షణ అంటే మాటలు కాదు. ఏ మతాన్ని కించపరచరాదు, మతాన్ని మార్చరాదు, పైగా అన్ని మతాలను గౌరవంగా చూడాలి. వారు మన మాన ప్రాణాల్ని హరిస్తూన్నా, మతాన్ని మంటగలుపుతున్నా మనం మాత్రం ధర్మ యుద్ధం చేయాలి, అయినా ఎవరు పెద్దగా తోడ్పాటును అందించరు సరికదా, వెన్నుపోట్లు మాములే! ఇది కూడా ఓ 300 ఏళ్ళ క్రితం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మొఘల్ సామ్రాజ్యములో, అందునా మతదురభిమాని అయిన ఔరంగజేబు పరిపాలనలో చేయాలంటే? అయితే మన అదృష్టవశాత్తు స్వామి వివేకానంద అన్నట్లు.. 'హిందుస్థాన్ కీ, హిందూమతానికీ మరణం అన్నదే లేదు. తరంగం వెనుకడుగు వేస్తుందే గాని వెన్నుచూపి పారిపోదు. అయితే ఈసారి ఆ హిందూ తరంగం ఉప్పెనై ముంచెత్తింది. సమస్త భారతావనినీ ఉత్తేజపరిచింది.

ఆ మహాశక్తి తరంగమే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ. అయన మతాభిమానే కానీ మతదురభిమాని కాడు. హిందూమతం కోసం ప్రాణాలర్పిస్తాడు కానీ ఇతర మతస్థుల ప్రాణాలు తీయడు. తన రాయఘడ్ కోట ముందే ముస్లింలు ప్రార్ధన చేసుకునేందుకు మాసీదును నిర్మించాడు. తన సైన్యంలో ముస్లింలకు సముచిత స్థానాలు కల్పించాడు. తన జైత్రయాత్రల్లో ముస్లిం స్త్రీలకు, పిల్లలకు అవమానం జరగరాదని తన సైనికుల్ని శాసించాడు. పవిత్ర ఖురాన్ తన చేతికి అందితే గౌరవించి తన ముస్లిమ్ అనుచరులకు అందిచేవాడు. ఇవి హిందువులు అతడికి తగిలించిన 'లేని' సద్గుణాలు కావు. సాక్షాత్తు మొగలాయీ సామ్రాజ్యంలో ఉన్న అప్పటి చరిత్రకారులు శివాజీని తిట్టిపోస్తూ చేసిన పొగడ్తలు.


ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ జీవితమే గొప్ప వ్యకిత్వ వికాస పాఠం. ఓ మామూలు సుబేదారు కొడుకైన ఆయన తన అవక్ర విక్రమ పరాక్రమంతో ఏకంగా ఓ హిందూ సామ్రాజ్యాన్నే స్థాపించాడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తల దించాలో, ఎవరి మెడలు వంచాలో ఆయనకు బాగా తెలుసు. గతంలో గొప్ప గొప్ప హిందూ రాజులు ధర్మయుద్ధం చేసినా శత్రువుల అధర్మానికి బలైపోయేవారు. శివాజీ మాత్రం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ శత్రువులను చిత్తు చేసేవాడు. అందుకే ఆయానికి చరిత్రకారులు పెట్టిన ముద్దు పేరు 'మాయల మరాఠీ!' ఎన్నో దిగ్విజయాలనూ చూశాడు, అత్యంత అవమానకర రాజీలూ చేసుకున్నాడు. అయితే పడిన ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. వ్యూహాలు మార్చాడు. ముష్కరులకు ముచ్చెమటలు పట్టించాడు.

యవ్వనం నుండి కత్తి పట్టి యుద్దాలు చేస్తున్నా, అంతరదృష్టిని మాత్రం దైవం పైనే నిలిపిన గొప్ప కర్మయోగి శివాజీ. 1677లో శ్రీశైలాన్ని సందర్శించినప్పుడు శివునికి పారవశ్యంలో ఆత్మసమర్పణ చేసుకోబోయాడట! ఛత్రపతి అయిన తరువాత తన సమస్తాన్ని గురువైన సమర్థ రామదాసస్వామి పాదాలవద్ద అర్పించి సంపూర్ణ శరణాగతిని పొందాడు. అలా హైందవ మత సముద్ధరణకై సర్వస్వము ధారపోసిన వీర శివాజీ ప్రతి హిందువుకూ ఆదర్శప్రాయుడు, ప్రాతఃస్మరణీయుడు.