తిప్పతీగ (Tinospora cordifolia) వలన ఎన్ని లాభాలో..
తిప్పతీగ (Tinospora cordifolia)
ప్రకృతిలో లభించే అనేక మొక్కలు మనకు చాలా మంచి చేస్తాయి. మన చుట్టూ పరిసరాల్లో పెరిగే చాలా మొక్కలు కలిగించే ప్రయోజనాలు మనకు చాలా వరకు తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ ఒకటి. ఆయుర్వేద మందుల్లో ఈ తిప్పతీగ ప్రాముఖ్యత చాలా వరకు ఉంది.
సిటీలో ఉండే వాళ్ళకి ఈ తిప్పతీగ గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ పల్లెటూర్లలో, పంట పొలాలలో తిప్పతీగ విరివిగా కనిపిస్తుంది. ఇది మనకి ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు రోజుకి రెండు తిన్నా మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని మనం ఎలాగైనా తీసుకోవచ్చు నేరుగా ఆకులు లేదా జ్యూస్ లాగా తీసుకోవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండడంతో కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పించటంలో సహాయపడుతుంది.
ఇది మన శరీరం యొక్క పనితీరును చురుగ్గా మెరుగుపరుస్తుంది. దీనికి సంస్కృతంలో అమృతం అని పేరు. ఈ తిప్పతీగ ప్రభావాలను చూస్తే నిజంగా ఇది అమృతంతో సమానమైనదనే అనిపిస్తుంది, అమృతం దేవతలను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచుతుంది. తిప్పతీగ కూడా అలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు:
తిప్పతీగ హైపోలిపిడెమిక్ (hypolipidemic) చర్యలను కలిగి ఉంటుంది. దీనిని సక్రమంగా ప్రతిరోజు వినియోగిస్తే బరువు తగ్గటంలో ఎంతో సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది.
తిప్పతీగలో రోగ నిరోధక చర్యలు మరియు యాంటీబయోటిక్ లక్షణాలు ఉండడం వలన ఇది డెంగ్యూ జ్వరం వంటి సాధారణ సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తుంది.
ఎక్కువ సంవత్సరాలుగా దగ్గు, ఎలెర్జితో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆకులు తీసుకోవడం వలన ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. తిప్పతీగని ఆయుర్వేదంలో అజీర్ణం అపాన వాయువు కడుపు ఉబ్బరం కోసం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.
తిప్పతీగ దుష్ప్రభావాలు:
తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లిస్మిక్ ఏజెంట్ అంటే రక్తం లోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది కాబట్టి మీరు ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే ఏ రూపంలో అయినప్పటికీ ఈ ఆకులు తీసుకోవడానికి ముందు మీ వైద్యున్ని అడిగి తీసుకోవడం మంచిది.
ప్రెగ్నన్సీ సమయంలో కానీ బాలింతలు పిల్లలకి పాలిచ్చే తల్లులు కానీ తిప్పతీగ ఆకులు తీసుకోవడానికి కచ్చితంగా మీ వైద్యున్ని అడిగి తీసుకోవడం చాలా మంచిది.
తిప్పతీగని ఎలా వినియోగించాలి:
తిప్పతీగ కాండం లేదా ఆకును కషాయం రూపంలో తీసుకోవచ్చు, కానీ సాధారణంగా దీనిని పొడి రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యుడు చెప్పినట్లయితే దాన్ని క్యాప్సిల్స్ లేదా రసం లాగా తీసుకోవచ్చు.
ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఒకటి నుంచి రెండు గ్రాముల తిప్పతీగ కాండం లేదా ఆకు రసాన్ని తీసుకోవటం మంచిది. రోజుకు రెండు ఆకులుగాను తీసుకోవచ్చు. ఆరోగ్య ఔషధంగా తిప్పతీగను తీసుకోవటానికి ముందు ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది.