శ్రీమద్రామాయణం - మానవీయ ధర్మాలు - 02
శ్రీమద్రామాయణం - మానవీయ ధర్మాలు
లోకములో ఎక్కడైనా రాజ్యాధికారం నాకు కావాలి అంటే నాకు కావాలి అని దెబ్బలాడుకునేవారు, యుద్దాలు కూడా చేసుకునే వారసులున్నారు.
కానీ అన్నయ్యా! రాజ్యము నీకు, అంటే కాదురా తమ్ముడూ! నీకు అని దెబ్బలాడుకున్న అన్నతమ్ములు రాముడూ భరతుడే.
ఎక్కడైనా అన్నగారి చెప్పులు కాలితో పక్కకు పెట్టే తమ్ముడు ఉంటాడు. కానీ భరతుడు రథము ఎక్కినా, పక్కన పెట్టకుండా మా అన్నగారి పాదుకలు అని తలమీద పెట్టుకుని తెచ్చి పాదుకాపట్టాభిషేకము చేసిన ఘట్టము ఒక్క రామాయణములోనే కనిపిస్తుంది.
అందుకే అన్నతమ్ములు అంటే ఎవరికైనా రామాయణం గుర్తొస్తుంది. అన్న అంటే ఎలా ఉండాలో రాముడిని చూస్తే తెలుస్తుంది, తమ్ముళ్లు అంటే ఎలా ఉండాలో లక్ష్మణ, భారత, శత్రఘ్నులను చూస్తే తెలుస్తుంది.
దాంపత్యం అంటే సీతారాములను చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ఇద్దరూ నోరు విప్పి మాట్లాడుకోనక్కర లేదు. ఆయన ఆవిడ వంక చూస్తే ఆవిడకు అర్ధము అవుతుంది, ఆవిడ ఆయన వంక చూస్తే ఆయనకు అర్ధము అవుతుంది.
పట్టాభిషేక సందర్భములో హనుమకు తెల్లని వస్త్రములు ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చిన తరవాత అన్నీ ఇచ్చేసాక సీతమ్మ మెడలో నుంచి ఒక హారము తీసి పట్టుకున్నది. రాముడు చూసి అన్నీ అందరకూ ఇచ్చాము కదా! ఎవరిని అయినా మర్చిపోయామా? అంటే సీతమ్మ మనసు రాముడికి అర్ధము అయినట్టు కాదు. అలా అడిగితే రాముడు తనని అర్ధము చేసికోవలసినట్లు తను అనుగమించ లేదు అని ఆమె అనుకుంటుంది.
రాముడు, సీతా ! నీ యొక్క ఐదవతనమునకు కారణము అయినవాడు. మన ఇద్దరి శాంతికి కారణము అయినవాడు, పౌరుషవంతుడు, బుద్ధిమంతుడు, పరాక్రమ వంతుడు, నవవ్యాకరణ పండితుడు, జితేంద్రియుడైన వాడికి ఇయ్యి అంటే ఆమె ఆ హారము హనుమకు ఇచ్చింది. వారిద్దరి మనసులు మాట్లాడుకుంటాయి, దాంపత్యము అంటే అది. తనకు అటువంటి భర్త అని సీతమ్మ, అటువంటి భార్య తనకు అని రామయ్య ఎంతో పొంగిపోయారు.