పీరియడ్స్ గురించి ఈ మూఢ నమ్మకాలను పెద్దవాళ్లు ఎప్పుడు వదిలేస్తారు? ఈ అంశం అమ్మాయిలది మాత్రమే కాదు, అందరిదీ!
ఆడపిల్లలకే కాదు; అందరికీ తెలియాలి!
ఏంచక్కా ఆడుతూ పాడుతూ గెంతుతూ తిరిగే వయసులో ఈ పీరియడ్స్ రావడం ఏంటో? మాకేం అర్థం కావట్లేదు. అసలే చదువుతో సతమతం అవుతుంటే ప్రతి నెలా మూడు, నాలుగు రోజులు ఈ చికాకు ఏంటో? ఇంత రక్తం పోవడం ఏంటో? దాంతో బయటకు చెప్పలేని సమస్యలెన్నో మాకు.. . ఇది కేవలం మా సమస్యా? అందరికీ తెలియాలి కదా?
మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లో 10 రోజులు కూచోబెట్టారు. చివరి రోజు చుట్టాలందరినీ పిలిచి ఫంక్షన్ చేశారు. అందరితో కలిసి ఫొటోలు దిగమన్నారు. దీనికి ఇంత హడావిడి అవసరమా అనిపించింది. మా ఫ్రెండుకు అయితే మెచ్యుర్ అయిన సమయం బాగోలేదంటూ పూజలు చేయించారు. ఇదంతా ఏమిటో అర్థం కాని అయోమయం.
అమ్మను అడగితే, నీకేం.. తెలియదు.. ఇలాగే చేస్తారు. నోర్మూసుకో.. అంది. ఇలాగే ఎందుకు చేయాలి? చేసే ప్రతి పనికీ ఒక అర్థం ఉండాలి కదా?
ఆ తర్వాత మాపై క్రమంగా నిబంధనలు మొదలయ్యాయి. 'నీవు ఆడపిల్లవి..' అంటూ షరతులు ప్రారంభమయ్యాయి. 'మగపిల్లలతో పెద్దగా మాట్లాడొద్దు. పెద్దగా నవ్వకు, ఎగరకు, పెద్దగా మాట్లాడకు, ఆటలు ఆడకు, తల పైకెత్తి నడవకు' అంటూ చెప్పడం మొదలైంది.
ఎందుకూ? అంటే మళ్లీ మామూలే! 'నువ్వు ఆ.. డ.. పిల్లవి'. ఏమడిగినా ఒకటే జవాబు : 'నువ్వు ఆ.. డ.. పిల్లవి'... 'నువ్వు ఆ.. డ.. పిల్లవి'. ఎందుకు పదే పదే ఇది గుర్తు చేస్తారు? మా చిన్నూ గాడు మగపిల్లాడు కదా! వాడికి అలాగే గుర్తు చేస్తున్నారా? లేదు. అదే విషయం అడిగాననుకొండి. మళ్లీ అదే సమాధానం : 'నువ్వు ఆ.. డ.. పిల్లవి'. బహుశా ఆడపిల్ల అంటే - నోరు మూసుకొని ఉండడం కాబోలు!
'ఆడపిల్ల' తొందరగా ఎదుగుతుంది.
నాలుగేళ్లు పోతే పెళ్లి చేయాలంటూ అంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య గబరాపడిపోతారు. దాంతో బాగా చదవాలన్న ఆసక్తి తగ్గుతుంది. మేమూ పిరికివాళ్లలా తయారవుతాం. అప్పటి వరకూ స్నేహితుల్లా ఉన్న మగపిల్లలతో కలిసి మాట్లాడి, ఆట పట్టించిన మేము, వారిని చూస్తుంటే ఏదో తెలియని బిడియం, బెరుకు మొదలవుతాయి. దూరంగా జరుగుతాం.
అప్పటివరకూ ఇష్టమైన డ్యాన్సు నేర్చుకుంటాం. ఫ్రెండ్స్‌తో కలిసి చిందులు తొక్కుతాం. గుళ్లు దగ్గర, రోడ్ల వెంట తిరుగుతూ... స్నేహితుల ఇళ్ల దగ్గర గంటల తరబడి ఆడుకుంటాం. మెచ్యుర్ అయిన దగ్గర నుంచి 'ఇక అవేమీ కుదరవు' అని అమ్మలు అంటుంటే మా మనసులు ఒప్పుకోవు. ఇప్పటివరకూ ఒకలా చూసిన చుట్టుపక్కల వారంతా, ఇప్పటి నుంచీ పెద్దవాళ్లం అయినట్లు చూస్తారు. ఏంటో!
మాకు నిండా 13 ఏళ్లు వచ్చాయా! ఏంచక్కా సెవెంత్ క్లాసు పాస్ అయ్యి ఎనిమిదిలోకి వెళుతున్న సంతోషంతో ఉంటాం. కాని మాకు లోపల ఏదో తెలియని బిడియం ఉంటుంది. ప్రతి నెలా వచ్చే నెలసరితో ఆ మూడు, నాలుగు రోజులు స్కూలుకు ఎలా నడిచి వెళ్లాలా? అని ఆలోచిస్తాం. అయినా చదువుకోవాలన్న పట్టుదలతో ధైర్యంగా ముందుకెళతాం.
ప్రతి నెలా పీరియడ్స్ వస్తాయని, దాంతో కడుపులో నొప్పి వస్తుందని అప్పుడప్పుడే అర్ధమవుతూ ఉంటుంది. అప్పటి నుంచి మాకు మాత్రమే అర్ధమయ్యే ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. శరీరంలో అవయవాల్లోనూ మార్పు కనిపిస్తుంది. కొత్త కొత్తగా ఉంటుంది. ఇంట్లో ఉన్న మగవాళ్లకు ఇవేమీ తెలియకూడదంటారు. ఆ ప్యాడ్స్ కనిపించకుండా దాచిపెట్టమంటారు.
ఎందుకు? మనం ఏం తప్పు చేశాం? ఇదంతా సహజమైన శారీరక మార్పే కదా? నాన్నకీ, తమ్ముడికీ, అన్నకీ తెలియాలి కదా, మేమంతా పడుతున్న బాధ. తెలిస్తే తప్పేముంది? రహాస్యంగా ఉంచడం వల్ల ఉపయోగం ఏముంది? మనవాళ్లకు అన్నీ తెలిస్తేనే కదా, మనం మరింత బాగా అర్థమవుతాం.
అమ్మా, టీచర్ చెప్పినట్లుగా ముందు జాగ్రత్తగా న్యాప్‌కీన్లు బ్యాగులో పెట్టుకున్నా. కాని పుస్తకాలు తీసి, పెడుతున్న ప్రతిసారీ అది కనిపిస్తూ ఉంటే 'మాకు ప్రతి నెలా మెన్సెస్ వస్తుంది' అని గుర్తు చేస్తున్నట్లు ఉంటుంది. ఆ టైంలో ఏదో తెలియని అసహనం.
స్కూలుకు వెళ్లాక డేట్ వస్తుంది.
అది తెలిసి వెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లి, రక్తపు మరక చూసి కంగారుపడిన సందర్భాలెన్నో... ఒక్కోసారి చమటలు పడతాయి. భరించలేని నడుము నొప్పి వస్తుంది. దాంతో బాధపడుతూ... క్లాసులో కూర్చొలేకపోతాం. అయినా మా బాధనంతా అణుచుకునేందుకు ప్రయత్నిస్తాం. 'ఇదంతా మామూలే' అని సీనియర్ అక్కలు అంటుంటే ప్రతి నెలా ఇంత రక్తం పోతుందా? అని బాత్‌రూమ్‌లోనే ఏడ్చుకుంటాం. అయినా మంచి మార్కులు తెచ్చుకునేందుకు దృష్టి పెడతాం. కష్టపడి చదువుకుంటాం.
ఒక వేళ డేట్ ముందే వస్తే, ఇంకా నెల రోజులు కాలేదే అని చేతి వెళ్ల మీద తేదీ లెక్కపెట్టుకుంటాం. క్లాసు పీరియడ్, పరీక్షల టైంటేబుల్‌తో పాటు ఈ డేట్ గుర్తుపెట్టుకోవడం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో క్లాసులో కూర్చున్నా... రక్తం ఎక్కడ డ్రసుకు అంటుతుందోనన్న భయంతో టీచర్ చెబుతున్న పాఠం మీద ఏకాగ్రత పెట్టలేం. ఇదేనేమో క్లాసులో వెనకబడటానికి కారణం అనిపిస్తూ ఉంటుంది.
చిన్న గాయమైతే పెద్దగా అరిచి, కట్టుకట్టించుకుని, పనిచేయకుండా కూర్చొనేవాళ్లం. ఇప్పుడు శరీరంలో నుంచి ఇంత రక్తం పోతుంటే భరించటానికే కష్టంగా ఉంటుంది. పదే పదే బాత్‌రూమ్‌కు వెళ్లాలంటే భయంగానూ, సిగ్గుగానూ ఉంటుంది.
స్నేహితులు గ్రౌండ్‌కు వెళ్లి ఆడుకుంటారు. వారితో ఆడనివ్వకుండా కాళ్లు ఎవరో కట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క మగపిల్లలకు ఎన్‌సిసి క్లాసు జరుగుతుంది. వారిని చూసి మేమా అవకాశం కోల్పోయాం అని బాధ కలుగుతుంది.
డేట్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండు వాళ్ల ఇంట్లో పచ్చని మొక్కలు ముట్టుకోవొద్దని చెబుతారు. అంటుకుంటే చెట్టు ఎండిపోతుంది అట. కాయలు కాయవట. దారుణం కదా, ఇలా అనటం? దేవుడు గదివైపు వెళ్లొద్దని చెబుతారు. ఇంట్లో ఏ వస్తువూ తాకొద్దొంటారు. ఎందుకూ? అంటే అంటు, ముట్టు, చెడు రక్తం అంటూ దూరంగా ఉంచుతారు. అయినా స్కూల్లో బాధ్యతగా అప్పగించిన చెట్టుకు నీళ్లు పోస్తాం. కాని ఆ చెట్టేకేమీ కాలేదు. ఈ మూఢ నమ్మకాలను పెద్దవాళ్లు ఎప్పుడు వదిలేస్తారు? మాకు సంబంధం లేని అపవాదులను మా మీదికి నెట్టకుండా ఎప్పుడు ఉంటారు?
మా అందరికీ తల్లిదండ్రులు, టీచర్లు సపోర్టుగా నిలబడాలి. ఇవన్నీ భరిస్తూనే ఆటల్లో రాణిస్తున్న క్రీడామణుల ప్రతిభను వివరించాలి. మా పరిస్థితి అర్థం చేసుకుని రెస్టు రూమ్స్‌లో విశ్రాంతి తీసుకోనివ్వాలి. మాకు మాత్రమే అవగాహన ఉంటే సరిపోదు. మాకు సహాయంగా ఉండేలా మగపిల్లలకు అవగాహన కలిగించాలి. అన్నకు, నాన్నకు, మా క్లాసులోని అబ్బాయిలు అందరికీ ఈ సంగతి తెలియాలి. ఈ అంశం అమ్మాయిలది మాత్రమే కాదు; అందరిదీ!
- ఒక సోదరి.