భద్రాచల వైభవము - భద్రాచలం లో శ్రీ రాముడు ఎలా అవతరించాడు?


Bhadrachala Vaibhavam

మేరు పర్వతము బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షము అయ్యి ఏమి కావాలి అని అడిగారు. అపుడు మేరు పర్వతము 'కొడుకు' అనకుండా 'పరమ భక్తుడైన కొడుకు కావాలి' అన్నాడు.

పర్వతమునకు పర్వతమే పుడుతుంది. ఆయనకు పుట్టిన కొడుకునకు 'భద్ర' అని ఎంతో చక్కగా పేరు పెట్టుకున్నాడు. కొండ కనక అచలము. 'భద్రాచలము' అయ్యాడు.

పుట్టినప్పుడు జీవుడు ఉంటాడు. తల్లి తండ్రి చేసిన తపస్సు కారణముగా భద్రుడికి జన్మత: రామ భక్తి అలవాటు పడింది. తరవాతి కాలములో నారద మహర్షి ఆయన దగ్గరకు వస్తే నాకు రామ నామ తారక మంత్రోపదేశము చెయ్యండి అని అడిగితే ఆయన ఉపదేశము చేసారు.

తల్లి, తండ్రులను నాకు రామచంద్రమూర్తి దర్శనము చెయ్యాలని ఉన్నది తపస్సు చేస్తాను అని అనుమతి అడిగాడు. వాళ్ళు సంతోషించి అటువంటి కొడుకు ఎక్కడ పుడతాడు అని తప్పకుండా తపస్సు చెయ్యి అన్నారు.

త్రేతాయుగము దాటి పోయింది, ఆ పర్వతము నారద మహర్షి చెప్పారని గోదావరి నది ఒడ్డుకి వచ్చి అక్కడ స్థిర నివాసము ఏర్పరచుకుని తపస్సు ప్రారంభించాడు. ఇప్పటికి భద్రాచల క్షేత్రములో ఆయన తల మీద రామ చంద్రమూర్తి పాదములు దర్శనము ఇస్తాయి. ఆయన తపించాడు అనగా ఎండ, వాన, కష్టము సుఖము ఏమీ పట్టించుకోకుండా అంతర్ ముఖుడై రామ నామము పట్టుకుని రామ చంద్రమూర్తినే ధ్యానం చేస్తూ ఉంటాడు.

రామచంద్రమూర్తి దర్శనము ఇవ్వాలి. అప్పటికి రామావతారము పరిసమాప్తి జరిగింది. ఆయన త్రేతాయుగములో దండకారణ్యములో తిరుగుతుండగా ఒక పెద్ద బండరాతి మీద విశ్రమించారు. రామ స్పర్శ కలిగిన కారణము చేత అందులో ఉన్న జీవుడే భద్రాచలముగా పుట్టాడు.

ఆ కారణము చేతనే రామ భక్తి ఏర్పడి ఆయన విశేషమైన తపస్సు చేస్తే చతుర్భుజములతో శ్రీమన్నారాయణుడిగా ప్రత్యక్షము అయ్యాడు.

శ్రీ మహా విష్ణువుకి ఒక లక్షణము ఉన్నది. ఆయన పై రెండు చేతులతో శంఖ చక్రములు పట్టుకుంటాడు. చక్రము ఎప్పుడూ కుడి చేతిలో, శంఖము ఎప్పుడు ఎడమ చేతిలో ఉంటుంది. ఎందుకనగా శంఖము యొక్క పని ఒకటి రెండు మారులు ఉంటుంది. ఒక్కసారి దానిని నోటితో పూరిస్తారు శంఖము విజయమునకు గుర్తు. కుడి చేతిలో శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ చక్ర ధారల చేత రాక్షసులను దునుమాడతాడు. అందు వలన కుడి చేతిలో చక్రము పట్టుకుంటాడు.

కింద రెండు చేతులలో ఆయన ఎప్పుడూ పట్టుకునే విధముగా ఒక చేతిలో వ్రేలాడుతున్న తామర పువ్వు, ఒక చేతిలో శార్గమనే ధనుస్సు పట్టుకుని నా గురించే కదా తపస్సు చేసావు అని ప్రత్యక్షము అయ్యాడు.

ఆయన ఒకసారి ఎగాదిగా చూసి నువ్వు శ్రీమన్నారాయణుడవు. కానీ నాకంటూ ఒక కోరిక ఉన్నది. నాకు రామచంద్రమూర్తిగానే ఇష్టము. రామావతారము అంటేనే ప్రీతి. భద్రుడు అలా కనపడితేనే సంతోషము అన్నాడు.

పరమేశ్వరుడు రాముడిగాకనపడాలి అంటే ఏమి ఉండాలి అని ఆలోచించుకుని భార్యకు మాత్రమే స్థానమైన ఎడమ తొడ సీతమ్మ మీద ఉండాలి. తానూ ప్రియమార నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకోవాలి. లక్ష్మీదేవి సీతమ్మగా మారి ఎడమ తొడ మీద కూర్చున్నది. తన చెయ్యి ఆమె చుట్టూ తిప్పి పట్టుకున్నాడు. లక్ష్మణ స్వామి ఉండాలి పక్కన ఉన్నాడు. శ్రీమన్నారాయణుడిగా రావడములో పైన శేషుడు పడగలు పట్టి వచ్చాడు. ఈయన రామ చంద్రమూర్తిగా మారారు కానీ శేషుడు అలాగే ఉండిపోయాడు.